*జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ వేగవంతం చేయాలి*
*60:40 శాతం నిష్పత్తిని సవరించాలి*
*నగరానికి చేరువగా స్థలాలు కేటాయించాలి*
*ఈ ఏడాది అక్రెడిటేషన్ లేనివారికి న్యాయం చేయాలి*
*విశాఖ అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకార్యవర్గసమావేశం తీర్మానం*
విశాఖపట్నం,2024,జనవరి 25,టుడే న్యూస్ :
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని
విశాఖ అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ కార్యవర్గం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సొసైటీ అధ్యక్షులు బి.రవికాంత్ అధ్యక్షతన సొసైటీ కార్యవర్గ సమావేశం గురువారం ఉదయం జరిగింది. ఈ సందర్భంగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై కార్యవర్గ సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని, అలాగే నగరానికి చేరువగా స్థలాలు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ప్రభుత్వం ఇళ్ల స్థలాల జీవోలో పేర్కొన్న విధంగా 60:40 నిష్పత్తిని సవరించాలని కోరారు. ఇళ్ల స్థలాల కోసం లబ్ధిదారుల వాటాగా చెల్లించాల్సి మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో చెల్లించే వెసులుబాటును ప్రభుత్వం కల్పించాలని కోరారు. అదేవిధంగా సొసైటీలో సభ్యులుగా ఉన్నవారిలో 250 మంది వరకూ 2023 సంవత్సరంలో అక్రెడిటేషన్ లేకపోవడం వల్ల ఇళ్ల స్థలాలకు అర్హత పొందలేక పోయారని వారికి కూడా న్యాయం చేయాలని కోరారు. ప్రస్తుతం స్థల లబ్ది పొందేందుకు అర్హత పొందిన జర్నలిస్టులతో పాటూ ఈ 250 మందికీ ఇళ్ళ స్థలాలు కేటాయించాలని కోరారు. కోవిడ్ సమయంలోనూ, ఇతర అనారోగ్య కారణాలు, ప్రమాదాల్లో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు కూడా మానవీయ కోణంలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు.ఈ అంశాలన్నింటినీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టి కి తీసుకొని వెళ్లాలని తీర్మానించారు. అదేవిధంగా ఇళ్ల స్థలాలకు సంబంధించిన జిల్లాకమిటీలో సభ్యులుగా ఉన్న జర్నలిస్టులు అర్హులైన జర్నలిస్టులు అందరికీ మేలు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు వచ్చేలా సొసైటీ నిరంతరం కృషి చేస్తుందని పునరుద్ఘాటించారు. కార్యవర్గ సమావేశంలో సొసైటీ గౌరవాధ్యక్షులు జి.జనార్దనరావు, సొసైటీ సలహాదారు ధవళేశ్వరపు రవికుమార్, ఉపాధ్యక్షులు పరుశురాం, మురళి కృష్ణా రెడ్డి, కోశాధికారి శరత్ కుమార్, కార్యనిర్వహక కార్యదర్శులు పి.ఎ.రావు, బొప్పన రమేష్, సంయుక్త కార్యదర్శులు అనురాధ, బి.శివప్రసాద్, చిట్టిబాబు, ప్రత్యేక ఆహ్వానితులు యర్రా నాగేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు కీర్తన్ , శ్రీనివాసరావు, లక్ష్మణరావు, విజయలక్ష్మి, స్వామి తదితరులు పాల్గొన్నారు.