*పోలీస్ కస్టడీకి వాణిజ్యపన్నుల అధికారులు*
విజయవాడ: వాణిజ్య పన్నుల శాఖ విజయవాడ డివిజన్–1 కార్యాలయం ఇంటెలిజెన్స్ విభాగంలో జీఎస్టీ అధికారులు బి.మెహర్‌కుమార్, కె.సంధ్య, సీనియర్ అసిస్టెంట్ కె.వి.చలపతి, ఆఫీస్ సబార్డినేట్ ఎం.సత్యనారాయణలను పోలీస్ కస్టడీకి తీసుకుంటున్నట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా తెలిపారు. నలుగురు ఉద్యోగులు విధులను దుర్వినియోగం చేసి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి రూ.కోట్ల అవినీతికి పాల్పడుతున్నట్లు రాష్ట్ర పన్నులశాఖ కార్యాలయం డిప్యూటీ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత నెల 31వ తేదీన కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు.
నిందితుల్ని విజయవాడ మూడో అదనపు మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ కోర్టులో ప్రవేశపెట్టగా నిందితులు నలుగురికి రిమాండ్ విధించిందన్నారు. నలుగురు ఉద్యోగులు కార్యాలయంలోని పలు రికార్డులను తారుమారు చేశారని, ఈ అవినీతిలో మరి కొందరు అధికారుల పాత్రపై విచారించాల్సి ఉన్నందున నిందితులను తమకు అప్పగించాలని న్యాయస్థానాన్ని కోరినట్లు చెప్పారు. న్యాయాధికారి ఆదేశాలతో ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నలుగురు ఉద్యోగులను పోలీస్ కస్టడీకి తీసుకుంటున్నట్లు సీపీ తెలిపారు.