సేంద్రీయ ఎరువు తయారీని ప్రోత్సహించండి :జివిఎంసి కమిషనర్ పి రాజా బాబు

 



విశాఖపట్నం,2022డి సెంబర్-29టుడే న్యూస్ :-  తడి చెత్త నుండి సేంద్రియ ఎరువు తయారీని ప్రోత్సహించాలని జివిఎంసి    కమిషనర్ పి రాజా బాబు అధికారులను ఆదేశించారు. గురువారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా 3వ జోన్, 23వ వార్డు పరిధిలోని కేఆర్ఎం కోలని, చైతన్య నగర్, సీతమ్మధార, తదితర ప్రాంతాలలో వార్డు కార్పొరేటర్ గుడ్ల విజయసాయి తో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో తడి పొడి చెత్త సేకరణ పక్కాగా జరగాలని తడి చెత్త నుండి సేంద్రియ ఎరువు తయారీని ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. కేఆర్ఎం కోలనిలోని పొడి వ్యర్ధాల సేకరణ విధానాన్ని, అక్కడ కొబ్బరి బొండాల నుండి పీచు తయారు చేయు విధానము, తడి చెత్త నుండి సేంద్రీయ ఎరువు తయారీ విధానాన్ని పరిశీలించి వారికి తగు సూచనలు చేశారు. అలాగే కేఆర్ఎం కోలని స్మశాన వాటికలో వ్యర్ధాల తరలింపు కొరకు మినీ ట్రాన్స్పోర్టేషన్ ఒకటి ఏర్పాటుకు అంచనాలు తయారు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. వార్డులో రోడ్లు, కాలువల పనులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయని ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకుని, సీతమ్మధార ప్రధాన రహదారిలో రోడ్లు నిర్మాణాన్ని పరిశీలించారు. పాండురంగాపురం వాణిజ్య సముదాయం నిర్మించి 30 ఏళ్ళు కావడంతో మరమ్మత్తులు చేసినా ప్రయోజనం ఉండదని, ప్రస్తుతం జరుగుతున్న పనులు నిలిపివేయాలని ఆదేశించారు. బీచ్ రోడ్లో మరుగుదొడ్ల నిర్మాణానికి అనువైన ప్రదేశాన్ని అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. వార్డులో యూజర్ చార్జీల వసూళ్ల గురించి ప్రజలకు అవగాహన ఏ విధంగా చేస్తున్నారో కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. తమ వార్డులో నీటి సరఫరాలో తరచూ సమస్యలు తలెత్తుతున్నాయని, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కార్పొరేటర్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్ళారు. నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మంచి నీటి సరఫరా కార్య నిర్వాహక ఇంజినీర్ సుధాకర్ ను ఆదేశించారు. చైతన్య నగర్లో రోడ్ల తగాదాలను పరిశీలించి ఏ విధంగా పరిష్కరించాలో చూడాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు.      

 ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కెఎస్ఎల్జి శాస్త్రి, జోనల్ కమిషనర్ విజయలక్ష్మి, పర్యవేక్షక  ఇంజనీర్ సత్యనారాయణ రాజు, ఏసీపీ వెంకటేశ్వర్లు, ఏఎంఓహెచ్ డాక్టర్ సునీల్, కార్యనిర్వాహక ఇంజనీర్లు శ్రీనివాస రావు, సుధాకర్, జివిఎంసి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సింహాచలంలో ఏడాదికి ఒక్క రోజే నిజరూపదర్శనం.. కారణం ఇదే

బ్రాహ్మణ సామాజిక అభివృద్ధి కూటమి గెలుపుతోనే సాధ్యం

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం