కాసాని జ్ఞానేశ్వర్ నాయకత్వంలో.. తెలంగాణలో టీడీపీ కి పూర్వవైభవం
-బడుగు, బలహీన వర్గాలకు టిడిపితోనే రాజ్యాధికారం
- ఇతర పార్టీల్లోకి వెళ్ళిన నాయకులు ఆత్మగౌరవం కోసం టిడిపిలోకి వస్తారు..
-మాజీ మంత్రి ఏ.మారెప్ప వెల్లడి
-ఖమ్మం బహిరంగ సభ దిగ్విజయంపై కాసాని జ్ఞానేశ్వర్ ని అభినందించిన మాజీ మంత్రి *
హైదరాబాద్,2022 డిసెంబర్ 26, టుడే న్యూస్:తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారిని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఏ.మారెప్ప మర్యాదగా పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టిడిపి తెలంగాణ పార్టీ బాధ్యతలు చేపట్టినందుకు కాసాని జ్ఞానేశ్వర్ కి శాలువ కప్పి సన్మానించారు. తెలంగాణ పార్టీ సారధ్య బాధ్యతలు చేపట్టిన వెంటనే ఖమ్మంలో టిడిపి భారీ బహిరంగ సభ ను పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా అభినందించారు. అశేష జన వాహినితో ఈ సభ దిగ్విజయం కావడంతో తెలంగాణ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులలో జోష్ వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ఖమ్మం బహిరంగ సభలో టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఇచ్చిన సందేశానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందని, ఆలాగే తెలంగాణ వ్యాప్తంగా టిడిపి పార్టీ కేడర్లో నూతనోత్సాహాన్ని నింపిందని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలకు, అగ్రకులాల పేదలకు టిడిపి ప్రభుత్వాల హయాంలోనే న్యాయం జరిగిందని.. నేటి ప్రభుత్వాలు నిరంకుశ పాలనలో ఏ వర్గ ప్రజలు సంతోషంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బిసి అణగారిన వర్గాల ముద్దుబిడ్డగా ఆ వర్గాలకు రాజ్యాధికారం దిశగా కృషి చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కి తెలంగాణ టిడిపి పార్టీ పగ్గాలను నారా చంద్రబాబు నాయుడు నియమితులవడం శుభసూచకమన్నారు. కాసాని జ్ఞానేశ్వర్ నాయకత్వంలో రాబోయే రోజుల్లో తెలంగాణ లో టిడిపికి పూర్వవైభవం ఖాయమన్నారు. తెలంగాణలో ఇతర పార్టీల్లోకి వెళ్లిన టిడిపి నాయకులంతా ఆత్మగౌరవం నిలుపుకునేలా త్వరలోనే మరలా మాతృ సంస్థకు తిరిగి వస్తారని మాజీ మంత్రి మారెప్ప ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ తెలుగుదేశం మహిళా విభాగం అధ్యక్షురాలు టి.జ్యోత్స్న, రాష్ట్ర నాయకులు కాసాని వీరేశ్, తదితరులు పాల్గొన్నారు.