తొలి తెలుగు సూపర్ స్టార్ చిత్తూరు వి నాగయ్య గారివర్ధంతి


హైదరాబాద్,2022 డిసెంబర్ 30, టుడే న్యూస్ :

ఆయన్ని చూడగానే సాత్విక, భక్తి పాత్రలు మదిలో కదలాడుతాయి. త్యాగయ్య. వేమన, రామదాసు వంటి భక్తి రసపాత్రలు పోషించి... వెండితెర త్యాగయ్యగా కీర్తి గడించారు. నటుడుగానే కాకుండా దర్శకుడిగా... సంగీత దర్శకుడిగా... గాయకుడిగా... నిర్మాతగా.... అనేక శాఖలు నిర్వహించి, తెలుగు తెరపై బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించి.. ప్రేక్షకులను మెప్పించారు చిత్తూరు నాగయ్య. 

తెలుగు సినిమా నటులకు ఫ్యాన్ ఫాలోయింగ్ కల్పించిన తొలి నటుడాయన.అంతేకాదు.. దక్షిణ భారతదేశంలో పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి నటుడిగా పేరు సాధించారు. చాలా మంది నటులు పాత్రలలో నటిస్తారు. కొంతమంది నటులు మాత్రమే జీవిస్తారు. అలాంటి అరుదైన గొప్ప నటులలో అగ్రగణ్యుడు చిత్తూరు వి.నాగయ్య.

తొలి రోజుల్లో సినిమా నటులంటే చిన్న చూపు ఉండేది. ఆ చిన్నచూపును పెద్ద చూపు చేసిన మహనీయుడు నాగయ్య. తెలుగు సినీ పరిశ్రమకే కాకుండా తమిళ, చిత్ర సీమకు కూడా గౌరవ ప్రతిష్ఠలను కల్పించిన ఏకైక నటుడు నాగయ్య. కేవలం నటనతోనే కాకుండా వ్యక్తిత్వంతో ఆగౌరవం తీసుకువచ్చారు. తన సినిమాల్లో చేసిన పవిత్ర పాత్రల్లాగా నిజజీవితంలో జీవించడం నాగయ్యకు మాత్రమే సాధ్యపడింది. చిత్తూరు నాగయ్య 1904 మార్చి 28న గుంటూరు జిల్లా రేపల్లేలో జన్మించారు. ఆయన అసలు పేరు ‘ఉప్పలదడియం నాగయ్య’.  చిత్తూరుకు చెందిన రామవిలాస సభ వారి "సారంగధర" నాటకంలో "చిత్రాంగి" వేషం  ఆయనలోని నటుడ్ని నలుగురికీ పరిచయం చేసింది. అప్పటి నుంచి ఆయన పేరు కాస్తా ‘చిత్తూరు నాగయ్య’ గా ప్రజల్లో మారుమ్రోగింది.

చిత్తూరులో జర్నలిస్టుగా పనిచేస్తూ నాటకాలు వేస్తున్న నాగయ్యను సినీ పరిశ్రమ ఆహ్వానించింది. అలా 1938లో హెచ్.ఎం.రెడ్డి ‘గృహలక్ష్మీ’లో హీరో వేషం వరించింది నాగయ్యను.  ఆ రోజుల్లో.. సినిమా అంటే పాటా పద్యం చక్కగా వచ్చి వుండాలి. అప్పుడుగానీ ఛాన్స్ ఇచ్చేవారు కాదు. నాగయ్య ఈ అంశాల్లో పర్ఫెక్ట్. తన తొలిచిత్రం ‘గృహలక్ష్మీ’ లో అన్ని పాటలు పాడి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నారాయన. అలా.. తొలి చిత్రంతోనే మంచి నటుడుగా ప్రేక్షకాదరణ పొందారు నాగయ్య.

1939లో బి.ఎన్.రెడ్డి తన ‘వందేమాతరం’ చిత్రంలో నాగయ్యకు హీరోగా అవకాశం ఇచ్చారు. ఆ సినిమాలో నాగయ్య నటించడమే కాకుండా, అద్భుతమైన సంగీతాన్ని సైతం అందించి మెప్పించారు. ఆ తరువాత ‘సుమంగళి’ చిత్రంలో వృద్ధ పాత్ర పోషించారు. ఆ వెనువెంటనే 1941లో ‘దేవత’ లో హీరో వేషం వేసారు. ఈ చిత్రాలు.. తమిళనాడులో కూడా ఘన విజయం సాధించి నాగయ్యకు మంచి పేరు తెచ్చాయి. ఆ తరువాత తమిళ భాష నేర్చుకొని.... కొన్ని తమిళ చిత్రాల్లో నటించి, అక్కడి ప్రేక్షకుల ఆదరణ కూడా పొందారు నాగయ్య. తన పాటలు తానే పాడుతూ అసలు సిసలు తెలుగు సినిమా హీరోగా ఒక వెలుగు వెలిగి ‘సినీత్యాగయ్య’గా పేరు గడించారు.

దర్శకుడిగా నాగయ్య తొలిచిత్రం త్యాగయ్య. ఆ చిత్రానికి ఆయన నిర్మాతగానూ వ్యవహరించారు. ఆ తరువాత నాఇల్లు, భక్త రామదాసు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆ చిత్రంలో ఆయన పాడిన ‘ఎందరో మహానుభావులు’ పాటను విన్న జేసుదాసు త్యాగయ్య ఎలా పాడి ఉంటారో, నాగయ్య పాట విని ఊహించుకోవచ్చని అన్నాడు. అంతటి ‘ఘనాపాఠి నాగయ్య.

భక్త పోతన, యోగి వేమన, త్యాగయ్య, స్వర్గ సీమ.. చిత్రాలు నాగయ్య జీవితాన్ని పూర్తిగా మార్చివేశాయి. అప్పట్లోనే లక్ష రూపాయల అత్యధిక పారితోషకం తీసుకొనే నటుడిగా ఖ్యాతి గడించారు నాగయ్య. ఆయన నటించిన ‘భక్త పోతన’ సినిమా చూసిన ఒక బాలుడు, బాలయోగిగా మారిపోయాడు.ఓ మనిషిని సినిమా యోగిగా మార్చగలిగిందంటే, ఆ సినిమా ఎంతటిదో.. ఆ నటుడి సత్తా ఇంకెంతటిదో చెప్పనవసరం లేదు.J

నాగయ్య.. ‘స్వర్గసీమ’ చిత్రం ద్వారా ఘంటసాల నేపథ్య గాయకుడిగా పరిచయం అయ్యారు. త్యాగయ్య సినిమా చూసి, మైసూరు మహారాజు.. నాగయ్యను నూటొక్క బంగారు నాణాలు, కంఠభరాణాలతో సత్కరించారు. దటీజ్ నాగయ్య. ఆ తరువాత ‘రామదాసు’ చిత్రంతో ఆర్థికంగా నష్టపోయి కోలుకోలేక పోయారాయన.నాగయ్య మాటతీరూ, చిరునవ్వూ.. అన్నీ శాంతం ఉట్టిపడుతూ వుండేవి. ఎవరి మీదా ఈర్ష్యాద్వేషాలూ, కోపతాపాలూ వుండేవి కావు. మహాకవి పోతన తన దగ్గర ఏం లేకపోయినా, ఉన్నదేదో దానం చేసినట్టు..  నాగయ్య కూడా దానాలు చేసి చేసి, ఆస్తులన్నీ పోగొట్టుకున్నారు. నమ్మినవాళ్లే  ఆయన్ను మోసం చేసి, నష్టపోయేలా చేసారు. త్యాగయ్య సినిమా తీస్తున్నప్పుడు నాగయ్య ‘రేణుకా ఆఫీసు’ ధర్మసత్రంలా ఉండేదట.చిన్న చిన్న నటుల దగ్గర నుంచీ.. పెద్ద నటుల వరకూ అందరికీ భోజనాలు అక్కడే.  మద్రాసులో స్కూళ్లూ, కాలేజీలూ తెరిచే రోజుల్లో ఆయన ఇంటిముందు విపరీతంగా జనం గుమిగూడేవారు. ఆయన లేఖలురాసి ఇస్తే కాలేజీ, హైస్కూళ్లలో అడ్మిషన్లు ఇచ్చేవారు. చివరి రోజుల్లో ‘లవకుశ’ చిత్రంలో వాల్మీకి పాత్ర ఆయనకు గొప్ప పేరు ప్రతిష్ఠలు  తీసుకువచ్చాయి.

తెలుగులోనే కాకుండా హిందీ చిత్ర సీమలో ఆయనకు ప్రత్యేక అభిమానులున్నారు. 1938-1973 మధ్య నాగయ్య 200పైగా తెలుగు, తమిళ సినిమాలలో నటించారు. తన నటనతోనే కాకుండా వ్యక్తిత్వంతోనూ ఆశేష ప్రేక్షకులకు అభిమాన నటుడయ్యారాయన. చివరి రోజులలో పేదరికాన్ని అనుభవించారు. లక్షల్లో పారితోషకం తీసుకున్న వ్యక్తి, కేవలం కొన్ని వందల రూపాయలకు చిన్న చిన్న వేషాలు వేశారు. ఉన్నంతలో నలుగురికి సాయం చేసిన నాగయ్య 1973లో డిసెంబర్ 30న స్వర్గస్తులైనారు. నాగయ్య మన మధ్య లేక పోయినా.. ఆయన అందించిన జ్ఞాపకాలు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయనడంలో సందేహం లేదు.🕉️💐🌺🌷🙏

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సింహాచలంలో ఏడాదికి ఒక్క రోజే నిజరూపదర్శనం.. కారణం ఇదే

బ్రాహ్మణ సామాజిక అభివృద్ధి కూటమి గెలుపుతోనే సాధ్యం

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం