' ఇన్ఫోసిస్' కి అన్ని విధాల సహకరిస్తాం ---రాష్ట్ర పరిశ్రమలు, ఐ.టి శాఖమంత్రి అమర్నాథ్ వెల్లడి
విశాఖపట్నం, జూన్ 17టుడే న్యస్: విశాఖలో తమ కంపెని కార్యకలాపాలు ప్రారంభించడానికి 'ఇన్ఫోసిస్ సంసిద్ధత వ్యక్తం చేయడంపై రాష్ట్ర పరిశ్రమలు, ఐ.టి. శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ సానుకూలంగా స్పందించారు. ఇన్ఫోసిస్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెడ్ నీలాది ప్రసాద్ మిశ్రా, ఇన్ఫోసిస్ రీజనల్ హెడ్ అమోల్ కులకర్ణి కంపెనీకి చెందిన ఇతర అధికారులతో మంత్రి అమర్ నాధ్ శుక్రవారం విశాఖలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇన్ఫోసిస్ ప్రతినిధులు మాట్లాడుతూ విశాఖలో తమ కంపెనీ 2500 నుంచి 3,000 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు ప్రారంభించనుoదని తెలియచేశారు. ఇందుకు అనువైన ప్రదేశాన్ని ఇప్పటికే సిద్ధం చేసుకున్నామని తెలిపారు. దీనిపై మంత్రి అమర్ నాథ్ స్పందిస్తూ, త్వరలోనే విశాఖ రాష్ట్ర రాజధానిగా రూపు దిద్దుకోబోతోందని ఈ నేపద్యంలో ఇటువంటి కంపెనీలు విశాఖకు రావడం అభినందనీయమన్నారు. ఇన్ఫోసిస్ అధికారులు మాట్లాడుతూ విశాఖలో తమ కంపెనినీ భారీ స్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని చెప్పారు. విశాఖలో ఐ.టి. ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి అమర్ తెలియచేశారు. ఇప్పటికే రాడిసన్ బ్లూ విశాఖకు వచ్చిందని, త్వరలోనే ఒబరాయ్ గ్రూప్ విశాఖకు రాబోతోందని అమర్ చెప్పారు. విశాఖలో కొత్తగా ఐ.టి. కంపెనీలు నెలకొల్పేవారికి కావల్సిన స్థలాలను ఇవ్వడానికి, మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్థంగా ఉందన్నారు. ఉత్తరాంధ్రలో అనేక మంది యువతీ, యువకులు ఐటి రంగంలో రాణీస్తున్నారని ఇటువంటి సమయంలో ఇన్పసిస్ వంటి ఐటి కంపెనీలు విశాఖకు రావడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికాలోని ఐటి కంపెనీల్లో పనిచేస్తున్న తెలుగు వారిలో 25శాతం మంది ఈప్రాంతానికి చెందిన వారేనని మంత్రి అమర్ అన్నారు. విశాఖకు సమీపంలోని భోగాపురం వద్ద ఇంటర్నేషల్ ఎయిర్ పోర్ట్ రానుందని, విశాఖ భోగాపురంని కలుపుతూ తీరం వెంబడి ఆరులైన్ల రహదారి నిర్మిస్తున్నామని, ఇది కూడా ఐటీ సెక్టార్ కు ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏపి టిఎస్ ఎం.డి. నందీశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.