*రిజర్వు బ్యాంకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలూ సహకార వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయి*
ది విశాఖపట్నం కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు
విశాఖపట్నం, జూన్28,టుడే న్యూస్: ఎక్కడో ఏదో అక్రమం జరిగిందంటూ దేశమంతటా చక్కగా నడుస్తున్న అనేక సహకార బ్యాంకులు, వాటి సభ్యులైన సామాన్య ప్రజలూ నష్టపోయేలా కేంద్ర ప్రభుత్వమూ, రిజర్వు బ్యాంకూ నియమనిబంధనలు సవరిస్తూ ఆంక్షలు విధిస్తోందని విశాఖపట్నం కోపరేటివ్ బ్యాంకు చైర్మన్ చలసాని రాఘవేంద్ర రావు వ్యాఖ్యానించారు. ద్వారకా నగర్లోని తమ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఆయన మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడారు. రిజర్వు బ్యాంకు కన్న దశాబ్దాల ముందే సహకార వ్యవస్థ ఏర్పడిందనీ, ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే రిజర్వుబ్యాంకు కంటే ముందు ప్రారంభమైన బ్యాంకులు 19 ఉన్నాయనీ, తమ బ్యాంకు 2016 లో మొదలవగా రిజర్వు బ్యాంక్ అనేది 1934 లో మొదలైందనీ అన్నారు.
ఆర్బీఐ ఆదేశాలు ఎలా ఉంటాయో ఉదాహరిస్తూ తమ సిఇఓ పాతికేళ్లుగా పని చేస్తున్నారని, 300 కోట్లున్న డిపాజిట్లను నాలుగువేల కోట్లకు తీసుకెళ్లటానికి ఆయన అంకిత భావంతో పని చేశారనీ అన్నారు. కానీ 15 ఏళ్లకు మించి ఎవరూ సిఇఓలుగా కొనసాగరాదని రిజర్వు బ్యాంకు రూల్సు సవరించేసిందన్నారు ఇపుడు తాము అత్యంత అనుభవజ్ఞుడి సేవలు కోల్పోవాల్సి వస్తుందన్నారు. ఇలాటి అనేక సవరణలు బ్యాంకింగ్ నియమనిబంధనల్లో చేర్చారనీ, వీటిమీద తమ బ్యాంకుల సమాఖ్య న్యాయ పోరాటం చేస్తోందనీ వెల్లడించారు.
సభ్యుల సంక్షేమానికి తమ బ్యాంకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కోవిడ్ బాధిత ఖాతాదార్లు 6 శాతం వడ్డీకి రుణం ఇస్తున్నామన్నారు.
కరోనా కాలంలో మృతి చెందిన సభ్యులు 1751 మంది కుటుంబాలకు 2.85 కోట్లు సాయంగా అందించామని తెలిపారు. అనారోగ్యంతో ఆస్పత్రి పాలయిన 1335 మందికి 6.48 కోట్లు చెల్లించామన్నారు. ఈ ఏడాది 10 శాతం డివిడెండుగా నిర్ణయించి 90 వేలమంది సభ్యుల ఖాతాలకు 24.98 కోట్లు జమ చేశామన్నారు.
ఇంకా రాఘవేంద్రరావు మాట్లాడుతూ
"ప్రస్తుతం 50 బ్రాంచీలున్నాయి. కొత్త శాఖల ఏర్పాటుకు ఆర్బీఐ అయిదేళ్లుగా అనుమతి ఇవ్వటం లేదు. ఈ ఏడాదన్నా అనుమతిస్తే చిత్తూరు, అమలాపురం, చీరాల, బాపట్ల, తాడేపల్లిగూడెం, కొమ్మాదిల్లో శాఖలు ఏర్పాటుకు దరఖాస్తు చేశాం. ఏపీలో జిల్లాల విభజన జరిగాక ఎనిమిది జిల్లాల్లో మా బ్యాంకు శాఖలేని పరిస్థితి ఉంది . అనుమతి లభిస్తే అక్కడ శాఖల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం
కరోనా తర్వాత ప్రజల ఆర్ధిక పరిస్థితి దెబ్బతింది. బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గాయి. ఇది బ్యాంకింగ్ వ్యవస్థ మీద పెను ప్రభావం చూపుతోంది. కరోనాలో 52 లక్షల కోట్ల సంపద సృష్టి నిలిచిపోయిందనీ, పరిస్థితి సాధారణ స్థితికి రావటానికి 12 ఏళ్లు పడుతుందని రిజర్వు బ్యాంకే అంచనా వేసింది.
ఈ పరిస్థితుల్లో రిజర్వు బ్యాంకు రెపో రేట్లు పెంచింది. కనుక సీనియర్ సిటిజెన్ల డిపాజిట్లకు తాము 7శాతం వడ్డీ ఇవ్వాలని నిర్ణయించాం. బంగారం రుణాలమీద తాము వసూలు చేస్తున్న వడ్డీ కూడా 7 శాతమేనని గుర్తించాలి. అంటే సభ్యుల సంక్షేమమే మా లక్ష్యం. కానీ ఆ అవకాశాలను దెబ్బతీసేలా రిజర్వు బ్యాంకు ఆదేశాలుంటున్నాయి. కోవిడ్ బాధితులకు 6 శాతం వడ్డీకే రుణాలు ఇస్తున్నాము.
ఏపీ ప్రభుత్వం కూడా సహకార వ్యవస్థను గుప్పిట పెట్టుకోవటానికే ప్రయత్నిస్తోంది. 46 సహకార బ్యాంకులుంటే 23 బ్యాంకులకు ఎన్నికలు లేకుండా అధికారులతో నడిపిస్తున్నారు. ఇది సహకార స్ఫూర్తికి విరుద్ధం.
రిజర్వు బ్యాంకు నిబంధనలైతే విడ్డూరంగా ఉన్నాయి. ఎంపీలకి, ప్రధానికి, రాష్ట్రపతికి అక్కరలేని విద్యార్హతలు బ్యాంకు డైరెక్టర్లకు ఉండాలంటున్నారు. పదవీకాలం అయిదేళ్లు కాదు నాలుగేళ్లే అని కుదించారు. ఇదంతా సహకార సభ్యులకు నష్టదాయకం" అన్నారు.
ఇన్ని సమస్యలున్నా తమ బ్యాంకు పురోగతి సాధిస్తోందనీ, కరోనాలో సర్వ సభ్య సమావేశాలు జరపలేకపోయామని, అవి ఈ ఏడాదినుంచీ మళ్లీ ప్రారంభించామనీ, ఈ ఏడాది 33 వేలమంది సభ్యులు ఈ సమావేశాలకు హాజరయ్యారనీ తెలిపారు.
మీడియా మీట్ లో చైర్మన్ ఎమిరిటస్ మానం ఆంజనేయులు, సీనియర్ వైస్ చైర్మన్ గుడివాడ భాస్కర్రావు, డైరెక్టర్లు స్టాలిన్, కాకి భవాని, ఎస్. జానకిరామచంద్ర రాజు, యు. పార్వతీదేవి, సిఇఓ పివి నరసింహ మూర్తి, జనరల్ మేనేజర్ ఎవి రామకృష్ణారావు, కోఆర్డినేటర్ ఎ రామకృష్ణారావు పాల్గొన్నారు