ఆంధ్రాకు 470 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను కేటాయించిన కేంద్రం
• మొదటిసారి కార్గో విమానం ద్వారా ఆక్సిజన్ నింపేందుకు ఖాళీ వాహనాలు పంపుతున్నాం
• రాబోయే రోజుల్లో రోజుకు రెండు గానీ, రెండు రోజులకు నాలుగు కానీ టాంకులు పంపుతాం..
• రాష్ట్రంలో ప్రతీ రోజూ 20 వేల మందికి ఆక్సిజన్ అందిస్తున్నాం..
• కోవిడ్ కేర్ సెంటర్స్ ప్రత్యేకాధికారి ఎం.టి.కృష్ణబాబు
విజయవాడ: ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహనరెడ్డి అవసరమైన వారికి తక్షణం ఆక్సిజన్ ను అందించేందుకు చర్యల్లో భాగంగా భారత ప్రభుత్వంతో మాట్లాడి మిలటరీ కార్గో విమానాలను రాష్ట్రానికి రప్పించడం జరిగిందని రాష్ట్ర కోవిడ్ కేర్ సెంటర్స్ ప్రత్యేకాధికారి, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు తెలిపారు. శనివారం గన్నవరం విమానాశ్రయం నుండి ఒరిస్సాలోని అంగూలకు రెండు ఖాళీ ఆక్సిజన్ టాంకర్లను భువనేశ్వర్ ద్వారా పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున కృష్ణబాబు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ కోవిడ్ తీవ్రత దృష్ట్యా ఎక్కువ మందికి ఆక్సిజన్ అందించాల్సిఉందని, 90 శాతం కంటే తక్కువ ఆక్సిజన్ లెవెల్ ఉన్నవారికి ఆక్సిజన్ అందించాల్సి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆక్సిజన్ సరఫరా నియంత్రణ, పర్యవేక్షణకోసం ప్రత్యేక సెల్ ను రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసామన్నారు. రాష్ట్రంలోని విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఆర్ఐఎన్ఎల్ ప్లాంటు ద్వారా 70 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను రాష్ట్రానికి కేటాయించడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో సుమారు వివిధ ఏజెన్సీల ద్వారా 250 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ లభ్యత ఉందన్నారు. మరో 170 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను చెన్నై, బళ్లారి, ఒరిస్సాలోని అంగూల్ నుండి తీసుకురావాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా చూసేందుకు ముఖ్యమంత్రి దిశానిర్దేశంలో పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నామన్నారు. ప్రతిరోజూ 2 టాంకులు, రెండు రోజుల్లో 4 టాంకులు గానీ కార్గో విమానాల ద్వారా పంపించి ఆక్సిజన్ రాష్ట్రానికి తీసుకురావడం జరుగుతుందన్నారు. ఇందుకు ఎయిర్ పోర్టు అథారిటీ డైరెక్టరు జి.మధుసూధనరావు, ఆపరేషన్ మేనేజరు అంకిత్ జైస్వాల్, ఇతర అధికారులు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. ఖాళీ ఆక్సిజన్ టాంకర్లను నింపి తిరిగి వచ్చేవరకూ మొత్తం వ్యవస్థను రాష్ట్రస్థాయి ఉన్నతాధికారి ఎస్.షన్మోహన్ వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారన్నారు. ప్రస్తుతం ఈ రోజు పంపిస్తున్న రెండు టాంకర్లు మొత్తం కెపాసిటి 46 మెట్రిక్ టన్నులు అన్నారు. రహదారి ద్వారా పంపే ఆక్సిజన్ టాంకర్లలో గాలి నింపి పంపడం జరుగుతుంది. అయితే విమానయాన భద్రతాచర్యల్లో భాగంగా ఆక్సిజన్ టాంకర్లను ఖాళీ చేసి పంపిస్తున్నామన్నారు. మొదటిసారి కార్గో విమానాల ద్వారా ఖాళీ వాహనాలను పంపేందుకు ఖాళీ చేయడం వలన కొంత జాప్యం జరిగిందన్నారు. ఈ అనుభవంతో భవిష్యత్తులో మరింత వేగంగా వాహనాలను విమానం ద్వారా పంపడానికి సులభతరం అవుతుందన్నారు. ఒరిస్సాలోని అంగూల్ లో నింపిన ఆక్సిజన్ టాంకులు తిరిగి రాష్ట్రానికి గ్రీన్ ఛానల్ ద్వారా రాష్ట్రానికి తీసుకువస్తామని కృష్ణబాబు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక రవాణా వ్యవస్థ పర్యవేక్షణను చేపడుతున్నట్లు ఆయన వివరించారు. నింపిన ఆక్సిజన్ వాహనాలు రాష్ట్రానికి రావడానికి రెండు రోజుల సమయం పడుతుందన్నారు. ఆక్సిజన్ సమర్ధవంతంగా వినియోగించుకునేందుకు వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ, పోలీస్, తదితర శాఖలతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. స్థానిక ఎయిర్ పోర్టులో ఇండియన్ ఆర్మీవారి కార్గో విమానంలో రెండు వాహనాలను ఎక్కించే ప్రక్రియను ఉన్నతాధికారి షన్మోహన్ వ్యక్తిగతంగా పర్యవేక్షించడం జరిగింది. ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రత్యేకాధికారి షన్మోహన్, ఎయిర్ పోర్టు అథారిటీ డైరెక్టరు జి.మధుసూధనరావు, ఆపరేషన్ మేనేజరు అంకిత్ జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు.